Tuesday, July 26, 2011

మన్మోహన సింహమా....

గర్జించు గాండ్రించు మన్మోహన సింహమా....
కుంభకోణాల కుంభస్థలాలు చీల్చు....
అవినీతి నక్కల ఆట కట్టించు...
సంకీర్ణ ధర్మపు సంకెళ్ళు తెంచు...

గర్జించు గాండ్రించు మన్మోహన సింహమా....
ఉగ్రవాదాన్ని ఊడలతో బెరుకు...
ఉగ్రవాదుల తలలు అడ్డంగా నరుకు...
తల్లి భారత మాత ఋణం తీర్చు...

గర్జించు గాండ్రించు మన్మోహన సింహమా....
తోలుబోమ్మవన్న నింద మాపు...
నీతి, నిజాయితీల శక్తి జూపు...
సామాన్యుల కడుపు మంటలార్పు...

Wednesday, May 19, 2010

బావుందంతా... అంతా బావుంది...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
తల వంచుకు బ్రతకడం... తల దించుకు పోవడం...
సర్దుకోవడం... సాగిపోవడం...
ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామ్యంలో... బ్రతుకీడుస్తున్న...
సామాన్యున్ని నేను...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
డబ్బు... అధికారం... చేతిలో చెయ్యేసి....
ప్రజాస్వామ్యం బట్టలూడదీస్తుంటే...
గుడ్డలూడిన ప్రజాస్వామ్యానికి మిగిలిన...
బుడ్డగోచిని నేను...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
లేచినోడు... లేవనోడు...
అడ్డదారికి అడ్డొస్తుందని.. మక్కెలిరగ్గొడుతుంటే..
కుంటిదైపోయిన... ధర్మానికి మిగిలిన...
ఒంటికాలిని నేను...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
కోటీశ్వరుడి కొడుకు.. ఎమ్మెల్యే అల్లుడు...
పోలిసోడి తమ్ముడు... చట్టానికంతా చుట్టాలే...
చుట్టాలంతా చేరి... సానికొంపగా మార్చిన చట్టం ఇంట్లో మిగిలిన
పాలేరుని నేను...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
రికమండేషన్లు... రిజర్వేషన్లు... పైరవీలు... లంచాలు....
ప్రతి కాడా నోటి కాడి కూడు లాగేసుకుంటుంటే...
పొట్టపోసుకోవడానికి బిచ్చమెత్తుకుంటున్న... విజ్ఞానం చేతిలో...
బొచ్చెను.. నేను...

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
అన్యాయం.. అధర్మం... అవినీతి... అన్నీ ఒకటై...
ఇల్లు కబ్జా చేసి నిలువ నీడ లేకుండా చేస్తే...
రోడ్డున పడి దారి తప్పిన గుడ్డి న్యాయం చేతిలో...
ఊతకర్రను నేను....

బావుందంతా... అంతా బావుంది... అలవాటైపోయింది...
అలుపు లేకుండా... ఆగిపోకుండా.... సర్దుకోవడం... సాగిపోవడం...
ప్రపంచపు అతి పెద్ద అప్రజస్వామ్యంలో...అలవాటుగా బ్రతికేస్తున్న...
అసామాన్యున్ని నేను...

Wednesday, May 27, 2009

రేయి - పగలు

రేయొక దళారీ.....

నిదుర మత్తు జల్లి.... నిశి నిశాలోకి దింపి...

కలల కన్యల కౌగిలి బేరాలు కుదురుస్తుంది....

పగలొక బేహారి.....

వెలుగు మంటలు రేపి... జీవిత వెతల్లోకి దింపి...

కష్టాల దారుల్లో అదృష్టాల వ్యాపారాలు చేస్తుంది....

Thursday, June 26, 2008

విచిత్రం

ఎంత విచిత్రం కదా... ఈ మనిషి తనం...
ఆకాశాన్నంటే.. ఆశల్ని మోస్తూ...
అంతే ఎత్తు లో అసంతృప్తిని సహిస్తూ...
ప్రయత్నాలు చేస్తూ... ఫలితాల్ని ఆశిస్తూ....
ఈ క్షణం ఓడితే.... అదృష్టాన్ని తిట్టుకుంటూ...
మరు క్షణానికి తోడుగా రమ్మని తననే వేడుకుంటూ...
సాధిస్తే... కాలంతో పరుగంటూ...
లేదంటే... ఉన్నంతలో మెరుగంటూ...
అనుక్షణం అహాన్ని సంతృప్తి పరుచుకుంటూ... సర్దుకుంటూ... సాగిపొతూ.....

Thursday, May 29, 2008

నా ప్రేమిక...

అమ్మ పొత్తిల్ల బాల్యం నుండి తను నా ప్రేయసి...
నా జీవితపు అనుక్షణానికి ప్రత్యక్ష సాక్షి...

అడుగులు రాని వయసు నుండీ తన వెనక పరుగులు తీయిస్తూనే ఉంది....
నాకు అలుపు రానికుండా... తను అందకుండా... పరుగులు తీస్తూనే ఉంది....

అలిసి ఆగిపోతే... చేతులు చాచి... హొయలు చూపి... ఆశలు రేపుతుంది...
గెలిచేలా సాగిపోతే... గీతలు గీచి... రాతలు మార్చి.. హద్దులు చూపుతుంది...

కసిగా కౌగిలించుకుందామంటే... ఇప్పుడే కుదరదంటుంది...
మరేప్పుడని మారాం చేస్తే... జీవిత కాలం ఆగమంటుంది...

నవ్విస్తుంది... నడిపిస్తుంది... కవ్విస్తుంది... కాటేస్తుంది...
కష్టాలు... కన్నీళ్లు... వర్ణాలు.. వైరాగ్యం.. అన్నీ వాటాలేస్తుంది...

అందినట్టే అంది జారిపోయే తన జాణతనం....
గాయాల్ని మబ్బుల్లా కరిగించే తన రాణిగుణం....

రవి తన నుదిటి తిలకం... వెలుగు తన మేని వర్ణం..
నిశి తన కురుల సంద్రం... శశి తన సిగలో కుసుమం...

ఋతువులు తన కులుకులు... దిక్కులు మేని మెలికలు...

ఇంతకీ ఎవరనుకుంటున్నారా... ఈ నా అపురూప కావ్య నాయిక....
మరెవరో కాదు...
మనకెవ్వరికీ అంతు చిక్కని... మహేంద్ర జాలిక... "కాల కన్యక".... నా ప్రేమిక...

Monday, March 24, 2008

చెలీ...

చెలీ...
నీ పలుకుల తీయదనం వెదురులో ఊదితే - అది వేణువై మ్రోగింది...
నీ చూపుల చల్లదనం ఆ జాబిలికి చేరిస్తే - అది వెన్నెలై కురిసింది....
నీ అధరపు మధువంతా ఓ చొట కురిస్తే - అది మధుశాలై వెలిసింది...
నీ నవ్వుల పరవళ్లు కాలన్ని తడిపేస్తే - అది వసంతమై విరిసింది...
నీ అలకల కులుకుల్ని కొయ్యలో కూరిస్తే - అది కొండపల్లి బొమ్మై నిలిచింది...
నీ నడుముల ఒంపుల్ని ఓ నదికి అద్దితే - అది కృష్ణవేణిగా మారింది...
నీ మేని తళుకుల్ని ఆ దివికి దిద్దితే - అది మెరుపై భువి చేరింది...
నీ నడకల హొయలన్ని ఓ పక్షికి నేర్పితే - అది కలహంసై ఆడింది...

మరి నేను.....
వెన్నెల్లో తడుస్తున్నా... వేణువులో మైమరుస్తున్నా...
కృష్ణను ఈదుతున్నా... మధువులు గ్రోలుతున్నా....
ఆనందపు మెరుపులలో... వసంతాల లోగిలిలో...
కలహంసలు వెంటరాగా... కొండపల్లి బొమ్మ చెయ్యిపట్టి సాగుతున్నా.....

Saturday, March 8, 2008

మనసా మారిపో...

ఏమైందే మనసా.... స్పందించడం మానేసావ్......
అడపా దడపా కూడా ఆనందించడం ఆపేసావ్....

సుబ్బులక్ష్మి గాత్రం...
నాన్న నుండి ఉత్తరం...

అమ్మ చేతి గోరు ముద్ద...
తమ్ముడితో గిల్లి కజ్జ...

బ్రహ్మానందం కామెడీ...
ఇంట్లో పండగ సందడి...


అన్నిటికి అల్లరి చేసేదనివి... ఆనందం తో గంతులేసేదానివి...
అయినా... ఎన్నాళ్లైపోయింది కదా....

సుప్రబాతం వినే టైం కి నిద్ర లేచి...
నాన్న కి ఉత్తరం రాసి...

అమ్మ తో కలిసి బోజనం చేసి...
తమ్ముడితో పందెం వేసి...

తీరుబడి గా కామెడీ సినిమా చూసి...
ఇంట్లో పండగ కి అందరం కలిసి....

నీ బాధ నాకర్థమైందిలే.....
అదృష్టాన్ని తిట్టుకోవడం కన్నా.. అనుగుణంగా మారిపోవడమే మిన్న...

అందుకే...
ఐపాడ్ లో సుప్రబాతం ఆన్ ది వే లో ఎంజాయ్ చెయ్...
నాన్నకి ఇంటర్నెట్ లో ఈమెయిలు ఇవ్వడం నేర్పించేయ్...
అమ్మకి వీసా తీసి అమెరికా తీసుకొచ్చేయ్...
తమ్ముడితో వీడియో గేమ్ ఫైటు చెయ్...
రోజూ కొంచెం కామెడీ కవర్ చేసి మెదడు లో కట్ కాపీ పేస్టు చేసేయ్...
వీకేండ్స్ వీలు చేసుకొని ఆత్మీయులందరిని పలకరించేయ్...